Seasons Greetings
user-icon Sign In
Go Back

రెండు దశాబ్దాల పూరీ జగన్

రవి కుమార్ వెల్దండి | Apr-20-2020
రెండు-దశాబ్దాల-పూరీ-జగన్

మామూలుగా అయితే ఒక సినిమా రిలీజ్ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ హీరో అభిమానులు ట్విట్టర్ లో ఆ సినిమాకి ఎన్ని సంవత్సరాలైతే  ఆ నంబర్ తో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఈ రోజుకి ఒక సినిమా విడుదలై 20 సంవత్సరాలైతే, ఆ సినిమా పేరు తో కాకుండా ఆ డైరెక్టర్ పేరు తో  హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అది ఆ డైరెక్టర్ కి ఉన్న క్రేజ్. ఆ సినిమా హీరో ఏ చిన్న హీరోనో అయి ఉంటాడు అనుకుందామంటే ఆయనేమో పవర్ స్టార్. అయినా కూడా తెలుగు సినిమా ప్రేక్షకులకి ఆయన మీద ఉన్న అభిమానం అలాంటిది.

 

ఆరేళ్ళ "చిరుత"ప్రాయం లోనే చిట్టి కథలు రాయడం, చిన్నప్పుడే చలం నుండి రావి శాస్త్రి వరకు  అన్ని రకాల రచనలు చదివి, రోజుకి రెండేసి సినిమాలు చూసి, డ్రామాలు వేసి,అమ్మానాన్న ఇచ్చిన పదివేల రూపాయలతో హైదరాబాద్ బాట పట్టి చిత్ర సీమలో ఉండే సినిమా కష్టాలు నుండి బయటపడటానికి మ్యాగజైన్లకు ముఖచిత్రాలను గీసి, బుల్లితెర ధారావాహికలకు ఘోస్ట్ డైరెక్షన్లు చేసి, కృష్ణ వంశీతో స్నేహం, రాం గోపాల్ వర్మ శిష్యరికం, పవన్ కళ్యాణ్ అరగంట అవకాశమిస్తే అయిదు గంటలు కథ చెప్పడం ఇందతా నేటికి ఇరవై సంవత్సరాల సినిమా జీవితాన్ని  పూర్తి చేసుకున్న పూరీ జగన్నాధ్ సినిమాకి పూర్వ జీవితం. 

 

బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ అయ్యాక కూడా పూరీ జీవితం 'దేశముదురు' సినిమా లో గుడ.. గుడ.. గుడుంబా శంకర్ చెప్పినట్టు ప్రతీ సీను క్లైమాక్స్ లాగానే సాగింది. 'టెంపర్' సినిమాలో చెప్పించినట్లు జీవితం పూరీ సరదా కూడా తీర్చింది, 85 కోట్లు పోగొట్టుకునేలా చేసింది. 'నేనింతే' సినిమాలో చెప్పించినట్లు ఏ రిలేషన్ కైనా డబ్బు, టైం, ప్రేమ  మూడు ఇవ్వాల్సి ఉంటుంది, కానీ డబ్బు చూసుకోవడానికి టైం ఇవ్వకపోవడం వల్ల ఆ రిలేషన్ అలా తనని మోసం చేసింది. 'బిజినెస్ మాన్' లో చెప్పించినట్లు 'ఎవరినీ నమ్మొద్దు. మనిషిని అస్సలే నమ్మొద్దు' అనే విషయం తెలుసుకునే లోపే అలా జరిగిపోయింది. 85 కోట్లు సంపాదించటం ఖచ్చితంగా కష్టమే, కానీ 85 కోట్లు పోగొట్టుకున్నాక అది తట్టుకోవడం కొన్ని కోట్ల రెట్ల కష్టం. ఆ కష్టాన్ని అధిగమించి పునర్వైభవం సాధించటం పూరీ జగన్ కే సాధ్యం.

 

పూరీ ,ఈ ఇరవై సంవత్సరాల్లో సినిమా కి పరిచయం చేసిన ఎనర్జీ ఏంటో ఒక లుక్కేస్తే, పూరీ బలం, హీరోలను బలవంతులుగా చూపి ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం. పూరీ హీరోలు అయాన్ ర్యాండ్ ఆబ్జెక్టివిటీకి కాసింత మోరల్స్ అద్దినట్టు ఉంటారు. సున్నితం గా రాముడు మంచి బాలుడు లాగా సాఫ్ట్ గా, బుద్ధిగా కాకుండా రఫ్ గా, మాస్ లుక్ తో కన్పిస్తారు. పూరీ హీరోలు నీతి సూత్రాలు వల్లించరు. తప్పో, ఒప్పో చెప్పాల్సింది సూటి గా, బుల్లెట్ దిగిందా? లేదా? అన్నట్లుగా చెప్తారు. దానికి ఉదాహరణలే తన తొలి సినిమాలోనే  "నువ్వు నందా వైతే నేను బద్రీ, బద్రీనాధ్" అని చెప్పడం. ఇడియట్ సినిమాలో " కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటి గాడు లోకల్" అని చెప్పించడం. పూరీ హీరోలకి మొండితనం తో పాటు క్లారిటీ కూడా ఉంటుంది. ఎంత సూటిగా అభిప్రాయాలు చెప్తారో, తమది తప్పని తెలిస్తే అంతే క్లారిటీ తో ఒప్పుకుంటారు. దానికి ఉదాహరణ టెంపర్ సినిమా లో ఎన్. టి. ఆర్ పాత్రలో చూడొచ్చు.

 

ఎపుడూ సినిమా వాళ్ళని అడిగే సామాజిక బాధ్యత అనే పదాన్ని బహుశా మొదటి సారి గా సినిమాలో వాడింది పూరీయే అయి ఉంటాడు. 'తిన్నామా  పడుకున్నామా తెల్లారిందా' అనేలా కాకుండా బాధ్యత గా ఉండాలని మీడియా మీద తీసిన సినిమా 'అయిన "కెమెరామెన్.." సినిమా లోనే మీడియా చెంప ఛెళ్ళుమనిపించాడు. పూరీ హీరోకి గోల్ ఉంటుంది. తిక్క తిక్కగా కనిపించినా, మొండిగా వ్యవహరించినట్లు అనిపించినా పూరీ ఏ హీరో "పోకిరి" కాదు, సమాజానికి పనికిరాని వాళ్ళు చచ్చిపోండి అని చెప్పే పక్కా 'బిజినెస్ మాన్".

 

ఇరవై సంవత్సరాలుగా అయాన్ ర్యాండ్ ఐడియల్ మాన్ లాంటి అసలు, సిసలైన హీరో ని మనకు అందించిన పూరీ జగన్నాధ్ నుండి మరిన్ని మాస్ బ్లాక్ బస్టర్ హిట్లు రావాలని, విజయ్ దేవరకొండ రాబోతున్న సినిమా రౌడీ ఫ్యాన్స్ ని అలరించాలని కోరుకుందాం.

 

 


Recent News