Seasons Greetings
user-icon Sign In
Go Back

అదృష్టం నడిపిన కథ భీష్మ

Ravi Kumar V | Mar-30-2020
అదృష్టం-నడిపిన-కథ-భీష్మ

కథ మూడు ముక్కల్లో

అదృష్టవశాత్తూ
హీరో పేరు, ఒక ఆదర్శవాది, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయించే కార్పొరేట్ సంస్థ యజమాని పేరు ఒకటే కావటం.

యాదృచ్చికంగా
అతనికి వారసులు లేకపోవటం, ఆయనను హీరో ఒక అటాక్ నుండి కాపాడటం, హీరో ఒక చర్చా కార్యక్రమం లో ఆయనని సపోర్ట్ చేయడం, హీరో తండ్రి ఆ కంపెనీ వారసుడు హీరోనే అని నోరు జారడం.

అదృష్టవశాత్తూ
అదే నిజం అయ్యి హీరో ఆపరేషనల్ CEO కావడం, కేవలం ముగ్గురంటే ముగ్గురే తెలిసిన హీరోకి వాళ్ళ వల్లనే విలన్ చేసిన కుట్రలన్నీ ఫెయిల్ అయ్యి చివరికి హీరో పర్మనెంట్ CEO అవ్వడం సినిమా కథ.

అదృష్టం, యాదృచ్చికం కాకుండా రెగ్యులర్ గా సినిమాల్లో ఉండే యాదృచ్చికానికి కొంచెం అదృష్టం కలిపిన ట్రాక్ హీరోయిన్ ది. చిన్నప్పుడు విడిపోయి మళ్ళీ కలుసుకుని, CEO హీరో కి సెక్రటరీ కావడం.


నా ఫర్ ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లైతే

నితిన్ కథకి నప్పాడు,నడిపించాడు, మీమ్స్ చేసే క్యారెక్టర్ కనుక వాటిలోహ్యుమర్ తో పాటుగా ఉండే అతి ని కూడా అతి చేయకుండా డోస్ మించకుండా చేసాడు. 'వాట్టే బ్యూటీ' పాట లో నితిన్ డ్యాన్స్ ఇరగదీశాడు. రశ్మిక, గీతాగోవిందం లో లాగా కాసేపు వద్దనుకోవడం,బ్రతిమిలాడించుకోవడం తరవాత కావాలనుకోవడం బాగానే చేసింది. విలన్ పాత్ర వేసిన జిష్ణు తనకు ఇచ్చిన దానికి న్యాయం చేసాడు. వెన్నెల కిషోర్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూ కథలో అన్ని మలుపులకి కారణమయ్యే పాత్ర లో తన ఈజ్ తో టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అనంత్ నాగ్, సంపత్ రాజు, నరేశ్, బ్రహ్మాజి, రఘుబాబు, వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు.

 

తెర వెనుక కథ

కథ, స్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ తానే అయిన వెంకీ కుడుముల అన్నింటినీ ఒక దానిని మరొక దానితో బ్యాలన్స్ చేసాడు. కొన్ని లాజిక్ లేని, అవసరం లేని సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు డైలాగ్స్ తో కవర్ చేసాడు. పోలీస్ వెహికిల్ లొ దిగిన తర్వాత వచ్చే ఫైట్ దీనికి ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. అది అక్కడ ఒక ఫైట్ ఉండాలి కాబట్టి ఫైట్ పెట్టిన సీన్ లా అనిపిస్తుంది. హీరోయిన్ ముందు వద్దనీ తరవాత ఐ లవ్ యూ చెప్పి, మళ్ళీ వద్దని, తిరిగి కావాలనుకోవడానికీ, అలాగే సీనియర్ భీష్మ హీరోని CEO చేయడానికి కారణాలను ఫ్లాష్ బ్యాక్ లో ఒక లీడ్ సీన్ లో చూపించి ఒక లాజికల్ కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. త్రివిక్రమ్ అసిస్టెంట్ గా చేసాడు కనుక డైలాగ్స్ లో ఆ పంచ్ కనిపించింది. హ్యుమర్ కి హ్యూమర్, అవసరమైన చోట ఆలోచింపజేసేవి గా ఉన్నాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ రఘుబాబు కాంబినేషన్ లో మరీ బాగున్నాయి. సేంద్రియ వ్యవసాయం థీమ్ కి ఎంటర్ టైన్ మెంట్ ని కలపడం లోసక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. హీరో తో పెద్ద పెద్ద స్కెచ్ లు వేయడం, వ్యూహాలూ, ప్రతివ్యూహాలూ చూపించకుండా జస్ట్ లక్ తో అలా అయిపోయిందని చూపించి అదే మాటని విలన్ తో క్లైమాక్స్ లో చెప్పించాడు "బలవంతుడిని గెలవొచ్చు కానీ అదృష్టవంతుడిని గెలవలేము " అని.

సితార ఎంటర్ టైన్ మెంట్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

మహతి స్వరసాగర్ సంగీతం బాగుంది, రీ రికార్డింగ్ లో మణిశర్మ అనుసరణా, అనుకరణా కనిపించింది.

కాసర్ల శ్యామ్ 'వాట్టే బ్యూటీ' లో తెలంగాణ మాండలికం వినిపించగా, 'సింగిల్స్ అంతెమ్' లో శ్రీమణి బ్రహ్మచారుల ఫ్రస్ట్రేషన్ వినిపించాడు.

'వాట్టే బ్యూటీ' పాట కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతం గా ఉంది, 'సింగిల్స్ అంతెమ్' కొరియోగ్రఫీ థీమ్ కి తగ్గట్టుగా ఉండగా 'సూపర్ క్యూట్' పాట లో మేకప్, కాస్ట్యూమ్స్ థీమ్ తీసుకోవడం బాగుంది.

సాయి శ్రీరాం కెమెరా వర్క్ బాగుంది. 'సింగిల్స్ అంతెమ్' లో నితిన్ ని సింగిల్ గా చూపించడానికి నితిన్ ని కాకుండా మిగిలిన అందరినీ బ్లర్ చేయడం బాగుంది. కార్పొరేట్ ఆఫీసుల్నీ, పంట పొలాల్నీ బాగా చూపించారు.

నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.


On the Whole, Bheeshma is a little bit message-oriented movie coated with luck and wrapped in Entertainment


Recent News