Seasons Greetings
user-icon Sign In
Go Back

విభిన్న ప్రేమకథా చిత్రాలు

రవి కుమార్ వెల్దండి | Apr-11-2020
విభిన్న-ప్రేమకథా-చిత్రాలు

అసలు ప్రపంచంలో ఏడే కథలు ఉన్నాయ్ అనే వారంట "కథా" శివబ్రహ్మం గా ఇండస్ట్రీలొ అందరూ  పిలుచుకునే సదాశివబ్రహ్మం గారు. ఈ ఏడు రకాల కథల్లోకి వచ్చే ఓ జాన్రా అయిన ప్రేమ కథల్లో ప్రధానం గా రెండు రకాల కథలు ఉంటాయి. ఒకటి కోటలో రాణితో, తోట లో రాముడి ప్రేమ కథ అయితే ఇంకొకటి, రాజు వేట కి వెళ్తే అక్కడ అడవి లో కలిసిన అమ్మాయితో సాగించే ప్రణయ గాధ. ఇవి హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ఆర్ధిక అసమానతలు, సామాజిక అంతరాలను ప్లాట్ పాయింటుగా రాసే కథలు, వాటిల్లోని చాలా వాటిల్లో అనూహ్యంగా, ఆశ్చర్యంగా హీరోయిన్, విలన్ కూతురు అయి ఉండటం కథలో ట్విస్టు పాయింటు. ఇలా అటూ ఇటుగా పెద్దింటి, పేదింటి హీరో హీరోయిన్ల మధ్య పుట్టే ప్రేమకథల మధ్య అడపాదడపా కొన్ని భిన్నమైన కథలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటి లో కొన్ని...

 

1 ఆర్య & ఆర్య 2

   "నేను ఆమె లవర్, ఈయన ఆమె లవర్" అని తన లవర్ వేరే వ్యక్తిని లవ్ చేస్తున్నా "ఫీల్ మై లవ్" అంటూ తన వెంటే తిరుగుతూ, తనకి హెల్ప్ చేసే వైరైటీ త్రికోణ ప్రేమకథ. 

 

2. ఆరెంజ్

   అసలు ప్రేమనేదే లేదని, లైఫ్ లాంగ్ ఎవరూ ప్రేమించుకోలేరని, అందరూ తమని తాము మోసం చేసుకుంటూ దానికి లవ్ అని పేరు పెట్టుకుంటున్నారని చెప్పే హీరోకి,  జీవితమంతా సరిపోయే ప్రేమ ఇవ్వమని అడిగే హీరోయిన్ల మధ్య జరిగే ఘర్షణ పూరిత ప్రేమకథ. వయసుతో నిమిత్తం లేకుండా, మెచ్యూరిటీ లేకున్నా టీనేజ్ లోనే ప్రేమించుకోవచ్చు,  కామించుకోవచ్చు అని చెప్పడం సెల్లింగ్ పాయింట్ అవుతుంది గానీ ప్రేమించుకోవద్దు అని చెప్పడం కాదు గనక సహజంగానే మన యువతరం సినిమాని, ఆ సినిమాలో నాగబాబు రోజూ ఫ్రెష్ గా  కొనుక్కొచ్చే కొత్త పూలకుండీని తన భార్య బాల్కనీ లో నుండి తోసేసి పగలగొట్టినట్టుగా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టించారు.

 

3. మనసంతా నువ్వే

    చిన్ననాడు తూనీగలతో ఆడుకునే సమయంలో విడిపోయిన స్నేహం, సుదూర తీరాలు దాటినా   కాలం తో పాటు "టిక్ టిక్" గడియారం సాక్షిగా పెరిగి పెద్దదై, ప్రేమగా, వీక్లీ లో సీరియల్ గా మారిన ప్రేమ కథ కాగా, చిన్ననాటి స్నేహితున్ని ప్రేమికుడి గా మార్చుకునే క్రమం లో హీరోయిన్ గుసగుసలు, రుసరుసలు, ఓర చూపులు, గుసాయింపులు ఆ సినిమా కథనం.

 

4.  నువ్వొస్తానంటే నేనొద్దంటానా

    చుట్టాలింటికి పెళ్ళి కి వచ్చిన లండన్ కోతి, నాలుగు ఎడ్లు, పాతిక ఆవులు, నలభై కోళ్ళు ఉన్న కోటీశ్వరురాలి ప్రేమలో పడి, ఆ అమ్మాయి అన్నయ్య పెట్టిన పందెం లో నెగ్గడానికి గొడ్డు కారం తింటూ వ్యవసాయం చేసి తనువంతా విరబూసే గాయాలను వరమాలగా చేసుకుని ప్రియురాలిని గెలుచుకునే కథ. 

 

5. ప్రేమలేఖ

    రైలు బోగీ లో పోగొట్టుకున్న సర్టిఫికెట్లలో  ఉన్న చిరునామాతో రాసుకున్న లేఖల ద్వారా ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకునే కథ.

 

6. ఆనందం

    బద్ధ శత్రువులుగా, ఉప్పు, నిప్పు గా ఉన్న హీరో హీరోయిన్ల మధ్య వాళ్ళ, వాళ్ళ లోని మంచితనాన్ని గుర్తించాక అనుకోకుండా పుట్టిన ప్రేమ కధ

 

7. మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి

      ట్రెయిన్ లో కలిసి చేసిన ప్రయాణం, అన్నవరంలో రూం కోసం చెప్పిన అబద్ధం వెరసి, శైలజ అండ్  కృష్ణమూర్తి లను మిస్టర్ అండ్ మిసెస్ గా మార్చే కథ.

 

8. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం

     ఆత్మహత్య చేసుకునే ముందు ఆలోచించుకునే అరనిమిషం లో పుట్టిన ప్రేమ కథ

 

9.  ఏ మాయ చేసావే 

      హీరో, తన కన్నా వయసులో పెద్దదైన, వేరే మతానికి, వేరే ప్రాంతానికి చెందిన హీరోయిన్ ని ప్రేమించే కథ.

 

10. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

      కళ్ళు మాత్రమే కనిపించేలా ఎదురు పడుతూ కనపడకుండా  హీరో కలల్ని నిజం చేసి కనపడకుండా పోయిన హీరోయిన్ క్లైమాక్స్ లో కలిసే కథ

 

11. మజిలీ

      ఒక భగ్న ప్రేమికుడి ని మూగ గా ఆరాధిస్తూ ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా...ఒక్కసారి చూడరా.. పిల్లడా అని వేడుకుని తన కి ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకుని, తన మనసులో స్థానం సాధించలేక సతమతమవుతూ, చివరికి తనప్రేయసి కూతురు కారణంగా తన ప్రేమను పొందే కథ.

 

12, ఇష్క్

  హీరోయిన్ రూపాన్ని, గొంతుని మిస్ మ్యాచింగ్ చేసుకున్న హీరో , ముందు అందాన్ని ప్రేమిస్తున్నానని మిస్ కాన్సెప్షన్ లో ఉండి చివరకు తను ఆ గొంతుని ప్రేమిస్తున్నానని తెలుసుకునే కథ.  

 

13. ఊహలు గుసగుసలాడే

       ప్రమోషన్ కోసం బాస్ కి తన ప్రియురాలి తో పెళ్ళి జరగడానికి అయిడియాలు అరువిచ్చే హీరో కథ

 

14. సమ్మోహనం

      ప్రేమంటే చిన్న చూపు ఉన్న హీరో, వాళ్ళ ఇంట్లో షూటింగ్ కి వచ్చిన "రీల్"  హీరోయిన్ వల్ల రియల్ గానే ప్రేమనేది ఉంది అని తెలుసుకునే కథ

 

15. చి.ల. సౌ.

      పెళ్ళి చూపులకి ఇంటికి వచ్చిన అమ్మాయికి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాలనుకున్న హీరో అనుకోని పరిస్థితుల్లో సింగిల్ డే లో ఆ అమ్మాయి ప్రేమలో పడే కథ

 

16. పెళ్ళి చూపులు

     పెళ్ళి చూపులకి వెళ్ళిన అబ్బాయి, అమ్మాయి ఆశల్ని, ఆశయాల్ని తెలుసుకుని, అమ్మాయి సాయంతో తన కలల్ని నెరవేర్చుకుని ఆ అమ్మాయి ప్రేమలో పడే కథ. ఒకరికొకరు సెట్ కారు అనుకున్న వాళ్ళే, ఒకరికి  ఒకరు హెల్ప్ చేసుకుని ఇరువురు ప్రేమలో పడే కథ. 

  

ఇంకా…

కలిసున్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను తెలుసుకోలేక, దూరమయ్యాకనో, దూరం కాబోతుంటేనో ప్రేమను గుర్తించే  "నువ్వే కావాలి", "అలా మొదలైంది" లాంటి కథలు

 ఎదురు పడిన ప్రతి సారీ అపార్థం చేసుకుని క్లైమాక్స్ లో నిజాన్ని తెలుసుకునే "సత్యం", "నువ్వు వస్తావని" లాంటి కథలు

 "దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే"  స్ఫూర్తి తో వచ్చిన ఎంగేజ్ మెంట్ అయ్యాక ఇంకొకరిని ప్రేమించే "రెడీ", "నువ్వు నాకు నచ్చావ్" లాంటి కథలు, ఇంకో అడుగు ముందుకేసి పెళ్ళి అయ్యాక కూడా ప్రేమకోసం పోరాడే "నిను కోరి" లాంటి కథలు విభిన్న ప్రేమకథలే. ఇవి డిఫరెంట్ లవ్ స్టోరీలు అయితే  అర్జున్ రెడ్డి , ఆర్ ఎక్స్ 100 సినిమా లు బోల్డు లవ్ స్టోరీలు.

 


Recent News