Seasons Greetings
user-icon Sign In
Go Back

సిరివెన్నెల సంవాద గీతాలు

రవి కుమార్ వెల్దండి | Apr-16-2020
సిరివెన్నెల-సంవాద-గీతాలు

సీతారామ శాస్త్రి గారు కురిపించిన సిరివెన్నెల లో తానమాడని తెలుగు ప్రేక్షకులెవ్వరు? ఆయన పాళీకి ఉన్న పలు పార్శ్వాలు తెలియనివి కావు. శృంగారాదిగా గల నవరసాలు పలికించే గీతాలు, ఆలోచింపచేసి, చైతన్యం కలిగించి, తట్టిలేపే ప్రభోధాత్మక గేయాలు , దేశ భక్తి గీతాలు, సిగ్గులేని జగాన్ని నిగ్గదీసిన పాటలు, జీవిత సత్యాల్ని ఆవిష్కరించే సందేశాత్మక గీతాలు, వాగ్గేయకారులను తలపింపచేసేలా రాసిన ఆధ్యాత్మిక గీతాలు ఇలా ఏ రసం ఒలికించినా, ఏ భావం పలికించినా, అవి శ్రోతలను  రస శిఖరాగ్రాలను, భావాల లోతులను స్పృశించేలా చేస్తాయి.  

 

అయితే గురువు గారు రాసిన ఇన్ని తరహా గీతాల్లో  సంవాద గీతాల గురించి ఈ ఆర్టికల్. సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న భావ వైరుధ్యాన్ని, వాళ్ళు పరస్పరం సంధించుకునే ప్రశ్నల్లా ఒక పాట లో తెలియజేసే సంవాద గీతాలు, సీతారామ శాస్త్రి గారి తొలి చిత్రం "సిరి వెన్నెల" లోనే రాసారు.

 

తన పుట్టుక, కులం, గుణం గురించి తెలుసుకోకుండా నన్ను ఎలా పెళ్ళి చేసుకుంటావు అని హీరోయిన్ అడిగినప్పుడు  "ప్రాణం పుట్టుక ప్రాణి కి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా?" 

"వసంతమాసపు కుల గోత్రాలను ఎల కోయిల అడిగేనా? తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా?" అని హీరో వేసిన ప్రశ్నలుగా రాసిన పాట అది.

 

ఇక స్వర్ణ కమలం సినిమాలో హీరో, హీరోయిన్లది సినిమా మొత్తం సంవాదమే. "అర్ధం చేసుకోరూ!!" అంటూ సాంప్రదాయ నృత్యం చేయడం ఇష్టం లేని పాశ్చాత్య పోకడలు పోయే హీరోయిన్. తనలో సహజంగా ఉన్న కళను, వారసత్వం గా పుణికి పుచ్చుకున్న విద్యను ప్రదర్శించమని, కళల పట్ల తనకున్న గౌరవంతో హీరోయిన్ని నాట్యం చేయమని ప్రోత్సహించే హీరో. వీరిద్దరి మధ్యా నిత్యం జరిగే సంవాదమైన స్వర్ణ కమలం సినిమాలో రెండు సంవాద గీతాలు ఉంటాయి.

 

“ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు “  పాటలో

"లయకే నిలయమై నీపాదం సాగాలి, మలయానిలగతిలో సుమబాలగ తూగాలి" అని హీరో అంటే "వలలో ఒదుగునా విహరించే చిరుగాలి,సెలయేటికి నటనం నేర్పించే గురువేడి? తిరిగే కాలానికి తీరొకటుంది, అది నీ పాఠానికి దొరకను అంది" అని హీరోయిన్ అంటూ "దూకే అలలకు ఏ తాళం వేస్తారు? కమ్మని కలల పాట ఏ రాగం అంటారు?" వేసే ప్రశ్న కి  "అలలకు అందునా ఆశించిన ఆకాశం, కలలా కరగడమా జీవితాన పరమార్ధం?"  అని హీరో తో చెప్పించి "నటరాజస్వామి ఝాటాఝూటిలోకి చేరకుంటే విరిచుకుపడు సురగంగకూ, అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె విరివనముల పరిమళములకూ  విలువేముంది" అనే సత్యాన్ని తెలియపరుస్తాడు.

 

"శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ" పాట లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే భావ సంవాదం

 

హీరోయిన్ 

పరుగాపక పయనించవె తలపుల నావా

కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ

ఎదిరించిన సుడిగాలిని జయించినావా

మది కోరిన మధుసీమలు వరించి రావా

 

హీరో

పడమర పడగలపై మెరిసే తారలకై.

రాత్రిని వరించకే సంధ్యా సుందరి

తూరుపు వేదికపై, వేకువ నర్తకివై.

ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ

నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ

నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ

 

హీరోయిన్ 

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా

ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా

అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా

ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా

ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా

వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

 

హీరో

చలిత చరణ జనితం నీ సహజ విలాసం

జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం

నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం

గగన సరసి హృదయంలో

వికసిత శతదళ శోభల సువర్ణ కమలం

 

స్వధర్మే నిధనం శ్రేయః

పర ధర్మో భయావహః!!నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని "ఒక్క సారి చెప్పలేవా",   తనను పెళ్ళి చేసుకోమనే హీరోయిన్ కి వద్దు అని హీరో సర్ధి చెప్పే సందర్భం లో రాసిన పాట. 

 

వెన్నెలేదో, వేకువేదో నీకు తెలుసా మరి? చందమామ మనకందదని ముందు గానె అది తెలుసు కొని చేయి చాచి పిలవొచ్చు అని చంటి పాపలకు చెబుతామా! అంటున్న హీరోకి  లేని పోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని జన్మలోనే నిదరోకు అని కంటి పాపలకు చెబుతామా! అనేది హీరోయిన్ కౌంటర్

అందమైన హరివిల్లు వంతెనేసి చిరుజల్లులతో చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉంటుందా? అనే హీరోయిన్ తో, అంతులేని అల్లరితో, అలుపులేని అలజడితో కెరటం ఎగసిపడుతుంటే ఆకాశం తెగి పడుతుందా?  అంటూ హీరో రిటార్ట్ 

మనసుంటే మార్గం ఉంది కదా! అనుకుంటే అందనిది ఉంటుందా? అనే  హీరోయిన్ ఆశకి అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా? అనేది హీరో ముక్తాయింపు.

 

నిజానికి ఒక్కొక్క పాటని లోతుగా విశ్లేషిస్తే మనం అర్ధం చేసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఒకే పాటలో రెండు పాత్రల భిన్న మనస్తత్వాలను, ఎవరి దృష్టికోణం లో వారిది కరక్టు అయినట్లుగా ఉపమానాలతో వారి వాదనని సమర్ధించుకునేట్లుగా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఇరుపాత్రలతో సంవాదం చేయించే సీతారామ శాస్త్రి గారి కలానికి రెండు వైపులా పదును ఉందని కొత్తగా చెప్పాల్సిన పని లేదు.


Recent News